మీరు మంచి వాళ్లేనా? ప్రపంచానికి కాదు.. మీకు!

మనం ప్రపంచం కోసం మనల్ని మనం మలుచుకుంటుంటాం. మనసొప్పని పనుల్ని సైతం ప్రపంచం, పక్క మనుషుల మెప్పు కోసం చాలాసార్లు చేస్తుంటాం. ఓ చిన్న ఉదాహరణ చెప్తాను. కోల్డ్ వార్ అనే పదం మనం తరచూ వింటూనే ఉంటాం. ఇద్దరు మనుషులు మిగతా ప్రపంచానికి చాలా ఆత్మీయులుగా కన్పిస్తుంటారు. కానీ ఎవరికీ తెలియని విధంగా వారిద్దరి మధ్య అగాధమంత శత్రుత్వం అలుముకుని ఉంటుంది. ఒకరికొకరు సాయం చేసుకుంటూనే ఉంటారు.. దాన్ని మనం చూస్తూనే ఉంటాం. "ఆహా.. ఎంత గొప్ప స్నేహం.." అని అబ్బురపడుతుంటాం.

ఇక్కడ నిజానికి వారిద్దరికీ ప్రతీ క్షణం "నేనెందుకు అవతలి వ్యక్తికి సాయం చేయాలి?" అనే ప్రశ్న తొలుస్తూనే ఉంటుంది, ఆ సంఘర్షణని కప్పిపుచ్చుకుని ఏడవలేక నవ్వుతూ ఒకరినొకరు భరిస్తూ ఉంటారు.

ఈ తరహా మనస్థత్వానికి మూల కారణం.. మన ఉనికి పక్క వ్యక్తీ, ప్రపంచం మన పట్ల కలిగి ఉన్న గుడ్ విల్ పై ఆధారపడి ఉంటుందన్న మన భ్రమ! ఇందులో మనం కూరుకుపోతే మన ఆలోచనలు ఇలా సాగుతుంటాయి.

"- నేను నీకు అనుకూలంగా ఉంటాను.
- నీ కోసం వీలైనంత వరకూ త్యాగాలు చేస్తాను.
- నీ పట్ల కేరింగ్ గా ప్రవర్తిస్తుంటాను.

నేను ఇన్ని చేస్తున్న దానికి ప్రతిఫలంగా నువ్వు నన్ను...

మంచి వ్యక్తిగానూ, తెలివితేటలు కలిగిన వ్యక్తిగానూ, నిజాయితీ కలిగిన వాడిగానూ పరిగణిస్తుండాలి. అన్నింటికన్నా ముఖ్యంగా నన్ను నువ్వు ఇష్టపడుతుండాలి. ఒకవేళ నీకు నాపై ఇష్టం లేకపోయినా ప్రపంచం కోసమైనా నన్ను గొప్పవాడిగా ఒప్పుకో, ప్రపంచం నాపై సదభిప్రాయం ఏర్పరుచుకోవడానికి నువ్వు పావుగా ఉంటానంటే నీ కోసం ఏమైనా చేయడానికి నేను సిద్ధం" అని మానసికంగా ఎదుటి వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకుని బ్రతుకుతుంటాం. మన ఆత్మగౌరవం ఇంత బలహీనమైన పునాదులపై నిర్మితమవుతోందని ఏ కోశానా మనకు సందేహం రాదు.

"రాముడు మంచి బాలుడు" తరహా ముద్రని కలిగి ఉండడం మనల్ని మనం ఇరుకు ఛట్రాల మధ్య స్వయంగా ఒరిపిడికి గురిచేయించుకోవడమే. మనల్ని మనం ప్రేమించుకోవడం, మన ఆలోచనలకు, మన చేతలకు స్వేచ్ఛని కల్పించుకోవడం మానేసి మన ప్రతీ చర్యకీ పక్క వ్యక్తిదీ, ప్రపంచానిదీ ఒప్పుకోలుని ఆశించి మంచితనం మూటగట్టుకోవాలనుకోవడం శుద్ధ అమాయకత్వం. మనుషులు మనల్ని ఇష్టపడాలని కోరుకోవడం ఓ వ్యసనం. అది మనల్ని బంధీల్ని చేస్తుంది.

మన ప్రతీ పనికీ, ప్రతీ ఆలోచనకూ ఇతరుల స్పందన ఎలా ఉంటుందన్నది మన నియంత్రణలో లేని విషయం. రాముడు మంచి బాలుడు తరహా భ్రమ నుండి బయటపడడం ద్వారా over smartness ప్రదర్శించి ఇతరుల్ని ఆకట్టుకోవడం మానేస్తాం. దీంతో ఎంతో సమయం ఆదా అవుతుంది, ఇంకెంతగానో మనసు తేలికవుతుంది.

ప్రతీ మనిషినీ సంతోషపెట్టడం అనే భ్రమలో ఇరుక్కుపోవడం వల్ల సరైన సమయంలో సరైన నిర్ణయాలు, అవి ఇతరులను తాత్కాలికంగా నొప్పించేవైనా/ ఇతరులకు భిన్నాభిప్రాయం కలిగినవైనా మనకు మనం తీసుకోవడం కష్టం. మన నిర్ణయాలకు కూడా ఇతరుల మెప్పుదలని కోరుకుంటున్నామంటే ఎంత దిగజారిపోయామో అర్థం చేసుకోవాలి.

ఇక్కడ మరో కోణమూ ఉంది. మనం అందరిలో మంచి వారు అనే పేరు తెచ్చుకోవడం కోసం ఎన్నో నచ్చని పనుల్ని మనసు చంపుకుని చేస్తుంటాం, ఇబ్బందిని పంటిబిగువునా భరిస్తూ నవ్వుని మొహకవళికలపై పులుముకుని తిరుగుతుంటాం. లోపల్లోపల అగ్నిలా జ్వలించే ఆ సంఘర్షణ ఏ బలహీన క్షణమో ఆగ్రహంగా వెళ్లగక్కబడుతుంది. ఒకరి మూలంగా పేరుకుపోయిన ఆవేశం వేరొకరిపై అకారణంగానైనా వ్యక్తమయితేనే తప్ప మనసు కొంతైనా శాంతించదు. ఆ కొద్ది క్షణాల ఆవేశం చాలు.. మనం మూటగట్టుకున్న మంచి పేరుని తుడిచిపెట్టడానికి!

మంచితనం ముసుగుని తొలగించుకుని మనల్ని మనం స్వేచ్ఛగా, సంతోషంగా ఉంచుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. దీనికి కావలసిందల్లా మనుషుల్ని నిరుత్సాహపరచడం మొదలెట్టడమే. యెస్.. మీరు విన్నది సరైన పదమే. ప్రతీ ఒక్కరినీ ఎందుకు సంతృప్తిపరచాలి? దానికోసం మనమెందుకు నలిగిపోవాలి? ఏ క్షణమైతే ఎవరేమనుకుంటే నాకేంటి అని స్వేచ్ఛగా మనకు నచ్చిన పనులు, మనకు సంతోషం కలిగించే పనులు మనం చేయడం మొదలెడతామో ఆ క్షణం మన బాధలు తగ్గిపోతాయి. ఇంతకుముందులా మనం ఉండడం లేదని కొత్తగా కంప్లయింట్లూ వస్తుంటాయి. రానీయండి.. ఇంతకుముందులా ఉండడం కోసం ఎవరికోసమో, ఎందుకోసమో ఎందుకు మనల్ని మనం చంపేసుకోవాలి? మంచివాడు అనుకున్నా, చెడ్డవాడు అనుకున్నా అది ఓ వ్యక్తి యొక్క అసమగ్ర ఆలోచనా దృక్పధం నుండి మనపై ప్రసరించే అపరిపక్వ ముద్రే తప్ప ఆ ముద్రని మోసుకు తిరగవలసిన అవసరం లేదని గ్రహిస్తే మనం మంచితనం కోసం పాకులాడం, మనకు నచ్చిన పనులే చేస్తుంటాం, మనకు నచ్చినట్లే ప్రవర్తిస్తుంటాం. మన హద్దులు మనం మీరకుంటే చాలు, ఏది చేసినా కొన్నాళ్లకు అదే చెల్లుబాటవుతుంది

మనం ఎ"దిగుతున్నామా...?


రోజు రోజుకూ పెరిగిపోతున్న సాంకేతిక విజ్ఞానం, జీవన సరళి లో వస్తున్నా మార్పులు నిజం గా మనిషిని ఉన్నత శిఖరానకు తీసుకుపోవడానికా? లేక పాతాళం లో తోక్కేస్తున్నయా...? ఏది నిజం.. ఏది వాస్తవం....

ముఖ్యం గా మన భారతావని లో ఒకప్పుడు ఉన్న విలువలు ఆ రోజుకూ ఉంటున్నాయా....? చిన్నా,పెద్దా,స్త్రీ,పురుష భేదం లేకుండా ఆధునికత,ఫ్యాషన్ అనుకుంటూ రోజు రోజుకీ దిగజారిపోతున్నారు. పిల్లలకు చెప్పవలసిన పెద్దలే ఆధునికత లో తప్పేముందీ అనుకుంటూ విలువలను మర్చిపోతే...... తదుపరి తరాలకు మన సాంప్రదాయాలను అందించేది ఎవరు...?

ఇప్పటి ప్రస్తుత తరాలకు కనీసం ఖద్దరు ఏమిటో తెలియని పరిస్తితి, పంచ కట్టు తెలియదు అబ్బాయిలకి.. ఇక అమ్మయిల పరిస్తితి చెప్పక్కర్లేదు.... జీన్సులు,టీ-షర్టులు మీదనుండి దిగటం లేదు ఈ మద్య.. కొన్నాళ్ళు పోతే అసలు చీర అంటే ఎలా ఉంటుంది.... ఎలా కట్టుకుంటారు అని అడుగుతారేమో....? దుస్తుల విషయం ఒక్కటే కాదు చాటింగులు, ఇంటర్నెట్టు, సెల్లు ఫోనులు ఇలా ప్రతీ ఒక్కటీ విలువలను చంపెస్తున్నయనటం లో ఏ మాత్రం సంకోచం అక్కరలేదు.... ఇక పోతే ఎలక్త్రానిక్ మీడియా ఇదో పెద్ద భూతంలా తయారైంది.... హాయిగా ఇంట్లో కుర్చుని కుటుంబ సమేతం గా చుసేతందుకు కూడా యోగ్యం గా లేని విధం గా ఉంటున్నాయి ఈ మద్య ప్రసారాలు....

అవి ఏంటి అని నేను వివరించనక్కరలేదు కానీ నా విన్నపం ఒక్కటే.......

 కనీసం ప్రతీ తల్లీ తండ్రీ తమ పిల్లలకు మనం ఉండవలసిన పద్దతులు, హద్దులు, విలువలు, వాస్తవాలు మొదలగు వాటి గురించి ఎప్పటికప్పుడు ఎంత బిజీ అయినా కొంత అయినా సమయం కేటాయించి చెప్పుకోగాలిగితే అయినా ఇంకొన్నాళ్ళు మన భారతావని కి ఉన్న గౌరవ మర్యాదలు తగ్గకుండా ఉంటాయని నా ఆశ, కోరిక...

దుఃఖపు విరామమే సంతోషమా.....?

నా ఏడవ తరగతి లో అనుకుంటా....., మా మేష్టారు మమ్మల్ని మా మా కోరికలను కాగితం మీద రాయమన్నారు. అప్పటి దాకా అల్లరి చేస్తున్న తరగతి గది అంతా నిశబ్దం గా మారింది, పిల్లలు అందరు అదే పనిలో నిమగ్నమైపోయారు.  అల్లరి మద్య విరామం గా ఒచ్చిన ఆ నిశబ్దం చాలా బాగుంది. ఆ నిశబ్దాలోచనను అక్షరాలుగా మలచుతూ కాగితం మీద కోరికలను రాస్తున్నారు పిల్లలంతా....!
       "నేను ఇంజనీర్ కావాలి"
       "నేను డాక్టర్ ని కావాలి"
       "నేను హీరో అవ్వాలనుకుంటున్నా...."
       " నాకు ఒక వంద కోట్లు డబ్బులు దొరికితే బాగుండు..!"
       "నేను జాతీయ స్తాయి క్రికెట్ ఆటగాడని అవుతాను"
       'నేను మంచి పేరు తేచుకుంటాను...!"
       వగైరా... వగైరా.............మనుషుల కోరికలు, 'ఇది కావాలి', 'ఇది జరగాలి' అని భౌతికంగా ఎన్నో రూపాల్లో కనిపించవచ్చు.
       కానీ వాటన్నింటి అంతః సారాంశం ఏమిటి???
       'నా జీవితం నేననుకున్నట్టు గా హాయిగా సాగిపోవాలి.'
       సంతోషపు రహదారి మీదే ప్రయానించాలని మనకు ఎంత ఉన్నా, కస్తాల గతుకులు వస్తూనే ఉంటాయి. అసలు ఆ సాఫీతనమే రోడ్డా? ఆ గతుకులే రోడ్డా? లేక ఈ రెండూ కలిపితేనే జీవన రహదారి అవుతుందా????
       'రెండు యుద్దాల మద్య విరామమే శాంతి' అంటారు.
       మరి అదేవిధంగా  రెండు విషాదాల/బాధల/దుఃఖాల మద్య విరామమే సంతోషమేమో!
       కాకపోతే ఇది మరీ నిరాశావాదం తో నిండుకుని ఉన్నట్లనిపిస్తోంది. అయితే, మనం ఎన్ని ఉదాహరణలు ఇచ్చుకున్నా దాని లక్ష్యం ఒక్కటే. జీవితం లో ఉన్న దుఃఖపు అనివార్యతను గుర్తించటం.
      ఒక ఊరట ఏమిటంటే, జీవితాన్ని ఆశావాదం లో కి మలుచుకోవడానికి మార్గం కూడా మన దగ్గరే ఉంది.
      చేయాల్సిందల్లా ఇంతకుముందు చెప్పుకున్నదాన్ని తిరగరాసుకోవడమే. రెండు దుఃఖాల మద్య విరామమే సంతోషం అయినప్పుడు, రెండు సంతోషాల మద్య విరామం దుఃఖం ఎందుకు కాకూడదు?

పర్ఫెక్ట్ ప్రపంచం కావాలా.....?

ఇది మనకి రోజు ఎదురయ్యే ఇబ్బందే,
         ఎవరో ఫలానా సమయానికి వస్తానంటాడు, కానీ రాడు.
         ఇంకెవరో ఈ రోజు తప్పకుండా ఇచ్చేస్తానంటాడు, కానీ ఇవ్వడు.
         క్లాసులో సార్ కి రాయాల్సిన పనిని రేపు చూపిస్తాను అని చెప్తాం, కానీ ఆ మరుసటి రోజు కాలేజీ కే వెళ్లం.
         ఇది ఇలా జరగాలని ఉంటింది, కానీ జరగదు.
         ఇందాక చెప్పినట్లు ఈ పని తప్పకుండా చేస్తామన్న హామీ ఇస్తారు, కానీ చెయ్యరు.
         ఇలా చెయ్యాలని ప్రొసీజర్ ఉంటుంది. కానీ ఎవ్వరూ దాన్ని అనుసరించరు.
         నియమం ఉన్నది అతిక్రమించడానికి, నిబందన ఉన్నది ఉల్లంగించడానికి, పద్ధతి ఉన్నది పాటించకపోవడానికి.
        దాంతో ఎక్కడ చూసినా మనకు తప్పే కనబడుతుంది.
        రోడ్ల మీద తప్పు,,,,,,,, ఆఫీసుల్లో తప్పు,,,,,,,,, ఇంట్లో తప్పు,,,,,,, బయట తప్పు,,,,,,,,.
        ఈ ప్రపంచం ఇలా ఉండాలి, ఇలా నడవాలి అనడానికి మనకు కొన్ని వ్యక్తిగత ప్రమాణాలుంటాయి. దీనికి అనుగుణం గా లేనిది ఏదైనా మనకు కష్టం కలిగిస్తుంది. వేదనకు గురిచేస్తుంది. ఇంకా ముఖ్యంగా అశాంతికి లోను చేస్తుంది.
         ఇందులో "అది తప్పే కదా మరి" అని తేల్చడం కన్నా కూడా, మనల్ని మనం శాంతి గా ఎలా ఉంచుకోవాలన్నదే ముఖ్యం.
         ఈ ప్రపంచం ఇలాగే ఉంటుంది, దాని మానాన అది నడుస్తూ పోతుంది అనుకునేంత విముఖత మనకు అక్కర్లేదు. లేదంటే ఈ ప్రపంచాన్ని మార్చాలని పూనుకున్న మహానుభావులందరినీ తప్పు పట్టిన వాళ్ళమవుతాం. కాబట్టి ఆ తప్పు మనం చేయనక్కరలేదు.
        అయితే---
        ఇక్కడ ఒక కీలక విషయం దాగుంది. అది ఏంటంటే....
        రెండేళ్ళ పిల్లగాడు తప్పుగా మాట్లాడితే మనకు కోపం రాదు. వాడింకా మాటలు నేర్చుకుంటున్నాడు అనుకుంటాం.
        అలాగే ఈ జనమంతా ఇంకా బతకటం నేర్చుకుంటున్నారనుకోవచ్చ్చు కదా!
        ఈ ప్రపంచం ఇంకా కొత్తగా నిర్మాణం అవుతూనే ఉందనుకోవచ్చు కదా!
        జీవితాంతం జీవించటం ఎలాగో నేర్చుకుంటూనే ఉండాలంటాడు ఒక రోమన్ తత్వవేత్త.
        ఈ ప్రపంచం ఇంకా నేర్చుకుంటూనే ఉందేమో! పర్ఫెక్ట్ అవడానికి సమయం పడుతుందేమో!
అంతకు ముందు ఆతరువాత, అష్టాచమ్మ సినిమాల దర్శకుడు శ్రీ ఇంద్రగంటి మోహన కృష్ణ గారితో కలిసి నేను చేసిన మూవీ ప్రమోషను ప్రోగ్రాం ను ఈ కింది వీడియోలో చూడండి.