ముక్కుమీద గాయానికి 21 ఏళ్ళు

నా ముక్కుమీద ఉన్న గాయానికి ఈరోజుతో సరిగ్గా 21 ఏళ్ళు నిండాయి.. సరిగ్గా 21ఏళ్ళ క్రితం అంటే 1993 జూన్ 1న, నేను అప్పుడు విజయవాడ దగ్గర కొండపల్లిలో మా అమ్ముమ్మ వాళ్ళింట్లొ ఆడుకుంటున్నాను.. మా నాన్న వొచ్చి ఒరెయ్ సుప్రీం నీకో తమ్ముడు పుట్టాడురా అని చెప్పగానే "హాయ్ నాకు తమ్ముడు పుట్టాడోచ్ అని పరిగెత్తుకెల్తుంటే నా అంత ఎత్తున్న గడప తగిలి ముక్కు పగలకొట్టుకున్నాను.." మొత్తానికి పుట్టాడో లేదో నా ముక్కుకి ఓ చిల్లి పెట్టేశాడు మా తమ్ముడు.. ఆ అతి చిన్న వయసులో (2సం.ల 4నెలలు) ఆరోజు నేను కింద పడుతుంటే మా నాన్న నన్ను పట్టుకోవటం, ఆసుపత్రికి వెళ్ళాక ముక్కు మీద కట్టుతో బెడ్ మీద ఉన్న అమ్మ దగ్గరకి వెళ్ళటం రెండు విషయాలు మాత్రం ఎలా గుర్తున్నాయో అలోచిస్తేనే ఆశ్చర్యం వేస్తుంది. తలచుకున్నప్పుడల్లా అద్దంలో నా ముక్కు చూసుకుని భలే నవ్వుకుంటాను.. ఇప్పటికీ ఆ గుర్తు చెరిగిపోలేదు మరి..! ఆ తర్వాత తర్వాత ఎన్నో కొట్లాటలు ఎన్నో బుజ్జాయింపులు.. ఇప్పటికీ.. !
ఐనా నాకు మా తమ్ముడంటే ప్రాణం.. -సత్యం జి, 01-06-2014, 09:56

మన సమాజానికి అందిన వరం రాఘవేంద్ర..!



2012 డిసెంబర్ లో మొదటిసారి మా ఇద్దరికీ పరిచయం అయ్యింది.. నాకింకా గుర్తుంది.. ఆరోజు నేను పూజలన్నీ ముగించుకుని ఓ ప్రేక్షకుడిగా, వీక్షకుడిగా అలా జనం మద్యలో మనం అనుకుంటూ కూర్చొని వేదిక మీదకి ఎక్కే మనిషెవరా అని ఎదురు చూస్తున్నాను.. అప్పుడే ఒక గొంతు ఎక్కింది.. ఆ గొంతు తనను కన్న కడుపులకి, తనకు పాటాలు చెప్పిన బెత్తాలకి నమస్కారం చెప్పి మాట పోటుకు, వాక్పోరులో అందరి హృదయాలను గెలుచుకునేందుకు రంగంలోకి దూకింది.. అప్పటివరకు ఎన్ని మైకులు గుసగుసలాడాయో అన్నీ ఒక్కసారిగా మౌనంగా ఆ గళాన్నే ఆలకించటం మొదలెట్టాయి.. ప్రతీ మాటలో, ప్రతీ పలుకులో ఏదో తెలియని ఆవేశం, ఒంట్లో ప్రతీ అణువూ పరుగులు తీయటం మొదలెట్టాయి.. లక్ష్యాన్ని సాధించేవరకు ఆగేదిలేదని తెగేసి చెప్పాయి.. అంతలో ఎప్పుడు దిగిందో వేదిక నుంచి ఆ గొంతు ఎవరికీ తెలియలేదు.. ఇంకా ఆ మాటల మత్తులోంచి తెలివిరాలేదు.. ఆ తరువాత అలాంటి ఎన్నో సభలు.. సమావేశాలు..

చినచిన్నగా ప్రేక్షకుడు వేదిక పంచుకున్నాడు, ఆ తరువాత తమ్ముడిగా గుండెను ఎంచుకున్నాడు.. ఆత్మీయత పెనవేసుకుపోయింది.. అతి స్వల్పకాలంలో ఆ గొంతు నన్ను "తమ్ముడూ.. " అని పిలవటమే కాకుండా తమ్ముడిగా మనసుతో దగ్గరకు హత్తుకుంది.. అది మామూలు గొంతుకాదు.. మామూలు మనిషి గొంతు అసలే కాదు..  ఎంతో మందిని బతికిస్తుంది, ధైర్యాన్నిస్తుంది, ప్రోత్సహిస్తుంది.. పోరాడమంటుంది, వెనకుండి నడిపిస్తుంది.. "నేనూ జీవితం లో ఫెయిల్ అయ్యానూ.. కానీ ఈరోజూ మీరెవ్వరూ ఫెయిలయ్యి ఫీల్ అయ్యే దాకా నేనూరుకోను, నేనున్నానూ.." అంటూ వెన్నుతడుతుంది.. కోనసీమలో పుట్టిన ఆ గొంతు జగమంతా వినిపిస్తా, జగాన్నంతా కదిలిస్తా, గెలిపిస్తా అంటూ నడుంబిగించింది. ఆ బిగువులో, ఎదురులేని ఆ తెగువులో నన్ను కూడా కలుపుకుంది.. నేనూ ఇప్పుడు మనిషి నుంచి ఆ గొంతు పక్కన కలిసే మరో గొంతునయ్యాను.. నాలాంటి ఎంతో మందిని తనలా గర్జించే గళాలుగా చెయ్యాలన్నదే ఆ గొంతు పెట్టుకున్న గట్టి లక్ష్యం..
ఆకెళ్ళవారి వంశ ఆణిముత్యం, మన సమాజానికి అందిన వరం రాఘవేంద్ర అన్నయ్య జన్మదిన సందర్భంగా..
శుభాకాంక్షలతో సత్యం జి సామాన్యుడు కాదు, 01-06-2014, 10:34

పెళ్ళి కొడుకు సంగతేంటీ..?



మీ ఇంట్లో కానీ మీ చుట్టాల్లో కానీ ఎవరైనా పెళ్ళి చేసుకుంటుంటే, కాస్త జాగ్రత్తగా వ్యవహరించండి. ముఖ్యంగా అమ్మాయి తరపు వాళ్ళు.. అబ్బాయి మంచివాడేనా..? చదువుకున్నాడా లేదా..? ఏమైనా ఆస్తులున్నాయా..? ఉంటే వాటికి సంబందించి ఏమైనా గొడవలున్నాయా..? అసలు వాళ్ళు చెప్తున్న ఆస్తుల వివరాలు సరైనవేనా..? అబ్బాయి ఏం ఉద్యోగం చేస్తున్నాడు..? వాటి వివరాలేంటి..? నెలకి ఎంత సంపాదిస్తున్నాడు..? ఒకవేల ఎక్కువే సంపాదిస్తున్నప్పటికీ ఏమైనా మిగులుస్తున్నాడా..? లేక దుబారా గా ఖర్చు పెట్టే వాడా..? స్నేహితులతో ఎలా మెలుగుతాడు..? ఇంట్లో వాళ్లతో ఎలా ఉంటాడు..? పెళ్ళి కోసం మన ముందు ఏమైనా నటిస్తున్నాడా..? వాళ్ళ ఇల్లు ఎలా ఉంది..? అంతకు ముందు నుంచే అక్కడ ఉన్నట్లైతే చుట్టు పక్కల వళ్ళని అదగటం, ఒకవేల మొన్నీ మద్యే మారారు అంటే, పెళ్ళి కోసమే, మనకి చూపించుకోటానికే ఇల్లు మారారా..? లేక మామూలుగానేనా..? అబ్బాయి ఇంట్లో వాళ్ళకి సిగరేట్, మందు లాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా..? ఉంటే క్యాజువల్ గా అప్పుడప్పుడూ బయత తాగుతారా..? లేక ఇంట్లోనే సిట్టింగులేసి ఇల్లు గుల్ల చేసే బ్యాచ్ ఆ..? తల్లి తండ్రులు, తోబుట్టువులను ప్రేమగా ఉంటారా..?  ఇంకోటి ఇంట్లో వాళ్ళనే ప్రేమగా చూస్తాదా తర్వాత మన అమ్మాయిని కూడా అలా చూడగలడా..?

ముఖ్యంగా మన అమ్మాయి భావాలు/ఆలోచన తీరు ఆ అబ్బాయితో కలుస్తుందా..?

ఇలా చాలా జాగ్రత్తగా "విచారణ" జరుపుకుని మరీ అడుగులెయ్యండి..!
ఇంత ఆధునిక సమాజంలో కూదా ఇంకా పెళ్ళిళ్ళలో మోసాలు జరుగుతూనే ఉన్నాయి.. తర్వాత బాధపడేకన్నా ముందే కాస్త సమయం పట్టినా మంచి "జోడీ" ని వెతకటం ఉత్తమం.

ఈ పోస్ట్ మీకు ఉపయోగకరమైనదిగా అనిపిస్తే మీ వాల్ పైన మీ స్నేహితులకు షేర్ చెయ్యండి..!

ఇట్లు సదా మీ సాట్నా సత్యం గడ్డమణుగు
సి.ఇ.ఓ. మరియు వ్యవస్థాపకులు,
సాట్నా టెక్నాలజీస్.
06-03-2014, 12:54

భారతం బానిసత్వంలోకి వెళ్ళిపోతుంది.

నేను కూడా కొన్ని సం.ల తర్వాత వేరే దేశం పోతా.. నోబెల్ బహుమతి వస్తుందేమో..? గత పదేళ్లలో వచ్చిన నాలుగు బహుమతులు ఇండియాని కాదనుకుని వెళ్ళిన వాళ్ళవే అట.. వేల కోట్లు ముడ్డెనక మూలుగుతున్న చిల్లి గవ్వ కూడా ఇలాంటి విషయాలకి పెట్టలేని దౌర్భాగ్యపు దేశం నా జన్మభూమి అని నేను చెప్పుకోలేను మరి.. :( ఎంతసేపూ రాజకీయాలు, గుడ్డలిప్పుకుతిరిగే హీరోయిన్లు తప్ప మన జనాలకి ఇంకేం అక్కర్లేదు..! మన తెలుగోడు మైక్రోసాఫ్ట్ కి సి.యి.ఓ. అయ్యాడు అని సంకలు గుద్దుకుంటున్నారు జనాలు.. అక్కడేమో అమెరికా లాంటి దేశాలు మీవోడికి మేము అవకాసం ఇచ్చాం చూశారా అంటూ వెక్కిరిస్తుంటే అది మాత్రం పట్టటంలేదు. ఏం మన దేశం లో ఉన్న డబ్బు కరెక్ట్ గా ఉపయోగిస్తే ఆ మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు పది పెట్టచ్చు ఒకే ఒక్క సం. లో.. దేశం దాకా ఎందుకు..? మనలో ఇలా ఫేస్ బుక్ లో లైకులు కామెంట్లు చేస్తూ కూర్చునే వాళ్ళలో ఎంతమంది ఎరోజు నేనూ ఇలాంటివి చేస్తాను అని ముందుకు వస్తారు..? మళ్ళీ ఫ్యామిలీ ప్రాబ్లంస్ తొక్కా అని చెప్పకండి.. ఎం ఇప్పటి వరకూ సాధించిన వాళ్ళంత..? వాళ్ళకి లేవా ప్రాబ్లంస్..? మీకు అడుగెయ్యటానికి ధైర్యం లేదు.. అంతే.. మీరు పిరికి పందలు కాబట్టే అడుగు వెయ్యలేకపోతున్నారు అని చెప్పటానికి నేను ఏ మాత్రం సంకోచించను..చెయ్యాలి అనుకున్న వాడికి కారణాలు అక్కర్లేదు.. ఎలాగైన చెసేస్తాడు.. ఇప్పటికైనా మన దేశంలో ఈతరహా ప్రోత్సాహకర తెగింపు ఆవేసం తో కూడిన ఆలోచనా ధోరణి వస్తే దేశం బాగుపడుతుంది.. లేదా రాబోయే కాలంలో భారత్ బానిస దేశం ఐపోక తప్పదు.బానిసత్వం అంటే మళ్ళీ వేరే వాళ్ళూ పరిపాలిస్తారా అని కాదు.. మనం ఇలాగే ఉంటే ఎప్పటికైనా మన దగ్గర ఉన్న మేధావులంతా (ఇక్కడ నేను ప్రస్తావించిన "మేధావులు" మానవాళి శ్రేయస్సుకు కొత్త కొత్త పనికొచ్చే విప్లవాలు తెచ్చ్చేవాళ్ళు.. యదవ తెలివితేతలు ఉన్న వాళ్ళు కాదు.) పొరుగు దేశాలకెళ్ళిపోతే మిగిలేది చెత్తే.. సో అప్పుడు ప్రతీ చిన్న విషయానికి మనం మళ్ళీ ఇంకో దేశం మీద ఆధార పడాలి.. వాళ్ళు కనుక నిరంకుశత్వం ప్రదర్శిస్తే ఇంకేముంది బానిసలైనట్టే గా..! కాబట్టి తస్మాత్ జాగ్రత్త..!
- సత్యం గడ్డమణుగు, 02-06-2014, 10:26pm

ఆకలి తీర్చా..!


పొద్దుగాలనుంచి అడుక్కున్నా ఒక్కమ్మా బువ్వెయ్యలేదు..
కడుపుల వాడెయడో అతంచుకి ఇటంచుకి తాళ్ళుగట్టి 
లాగేత్తుండు.. కనీతం సుక్క నీళ్లైనా గొంతుల పోద్దామని 
ఆ ఈదిచియరున్న పంపుగాడికి పోతే,
అది గూడక అమ్మగార్ల లెక్క ఏషాలేత్తంది..
ఆళ్ళేమో ఒక్క మెతుకు ఇయ్యలే, ఇది గూడ ఒక్క సుక్క బియ్యలే..

ఔలే ఎట్తాగిత్తాయ్..?
అతలే మన యవ్వారం ఎడిసిమంగి మడతాలాగుంది..

కొద్దికొద్దిగ నా వంట్ల సత్తువ తగ్గుతా ఉంది.
ఆ పంపు కాడ్నే కూలబడ్డా..
పంపుని పట్టుకోనీకి శెయ్యి గూడ లెయ్యలే.,
అప్పుడు జూసినా ఆ పంపు కన్నంల రెండు సుక్కలున్నయ్..
అవి కాసేపట్ల కారి కింద పడతయ్..
ఎట్టాగూ తలని లేపే ఓపిక లేక
నోటిని పంపుకుందకి పెట్టిన..

సరిగ్గ సుక్క రాలే టైముకి ఓ కుక్క
నాలికతో ఉన్న రెండుసుక్కలూ నాకేసింది..
బారెడు నాలిక్కి ఆ రెండు సుక్కలు సరిపోక రొప్పుతా నన్ను సూతంది..

అప్పటికే కింద పడ్దప్పుడు తగిలిన దెబ్బల్నుంచి
కారుతున్న రక్తం వాసన ఆ కుక్క నాసికలకి తాకింది..
చిన్నగ నా మీద ఉన్న రక్తాన్ని సుతారంగ నాకేత్తోంది ఆ కుక్క..
అది అలా నా రక్తం కోసం నా మీద పడగానే
ఆ ప్రయత్నంలో అప్రయత్నంగా దాని కాలు నా ముక్కుకి రాసకపోయి
రక్తం నా నోట్లోకి కారింది..
నాకు గొంతులోకి జారుతున్న ఉప్పని ద్రవం తప్ప ఇంకేమీ
తెలియలేదు.. తెలుసుకునేంత తెలివి లేదు..

తెలివి రాగానే లేచి చూశాను
నాకింక ప్రాణం లేదు..
ఎందుకంటే అప్పటికే ఆ కుక్క నా వొళ్ళు మొత్తం
కొరికి మింగేసింది.. నిజానికి గొంతులోకి జారిన ఉప్పని ద్రవం
ముక్కు మీద గాటుకి కాదు ఆ కుక్క కాటుకి వచ్చిన రక్తం..

పోన్లే నా జీవితంల అడుక్కోడమేగాని పెట్టింది లేకపాయే..
ఇట్టాగైనా పోతా పోతా ఒక జీవి ఆకలి తీర్చిన.
గది సాల్ నాకు..!

- సత్యం గడ్డమణుగు, 04-02-2014, 03:51

తాగుబోతు భారతం||సాట్నా సత్యం||

*****************************
సంకలెత్తిన సిన్నదాన్ని సినిమాల జూసి సప్పట్లు గొట్టే ఈ జనాలు..
సక్కంగ బాగుపడే పన్లు జేసుకుందాం రండిరా అంటే, మాట వినరు..

సీను లేని సినిమాకి సింగిల్ డే కూడా పోరు,
సారా తాగి సిందులేసి ఇంటిదాని సీను సితారయ్యే దాకా ఊరుకోరు..

నాయాళ్ళు.. తాగనీకి డబ్బులొస్తాయిగాని,
సంటోడ్ని ఇస్కూలికి పంపమంటే మాత్రం పేదోళ్ళమని నీలుగుతరు..

తాగనీకి అప్పుల్జేస్తరు..
అప్పుల్దీరట్లే అని బాదల తాగుతరు..

తాగనీకి ఇల్లు గుల్ల జేస్తరు..
ఇంటిని సక్కబెట్టలేకపోతుండా అని మల్లా తాగుతరు..

పెళ్ళాం మెడల తాళి ని సారకు తాకట్టు బెడతరు,
నా బుచ్చికి కమ్మలన్నా సేయించకపోతింటే అని బాదపడతరు..
ఆ బాదల మల్లా తాగుతరు..

ఎవడైనా తాగి వాగతంటే తాగుబోతు నాయాల గాడు అని
తిట్టిన నాకొడుకే పొద్దుబోయేసరికి తాగి తూలుతా వస్తడు..

వారానికోపాలి సెల్లుల్లో బూతు బొమ్మలెక్కించుకోనీకి
సెల్లు షాపోనికి 200 రూపాయలిస్తడు కానీ,
నెలల బిడ్డ ఆడుకోనీకి ఓ చిన్న బొమ్మ కొనీనీకి డబ్బుల్లేవ్ అంటడు..

తాగితె గానీ అందంగ గనపడని పెళ్ళాం,
ఆ సార కంపుతోనే సంసారం చేయ్యాల..

పంచుతున్న సార ప్యాకెట్టు నోటిత కొరికి
సుక్క సప్పత్తునే, మద్యం నిషేదం అని సెప్పే సిల్లరనాయాళ్లకి
జేజేలు కొట్టి మరీ వోటులేస్తరు..
ఐదేళ్లకోసారైనా ఫ్రీగ మందు దొరికిద్దని సిన్న ఆశ..

- సాట్నా సత్యం, 16-01-2014, 11:49

పిల్లలకి సెక్స్ ఎడ్యుకేషన్ అవసరమా..?

యాక్చువల్లీ,,, చుట్టూ ఉన్న పరిసరాలు, మనస్తత్వాలు భిన్నంగా ఉన్నప్పుడు, పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ అందించినా సరైన ప్రయోజనం ఉండకపోవచ్చు.. ఉదాహరణకి, అవగాహన కోసం అని 8వ తరగతిలోనో ఏమో అనుకుంట, మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్త గురించి, అలాగే ఎయిడ్స్ గురించిన అంశాలను ప్రభుత్వం వారు జీవ శాస్త్రం లో ఉంచారు.. అయితే పాటం వినేటప్పుడు ఆ సదరు ఉపాద్యాయులు, విద్యార్ధులు సరైన భావాన్ని అర్దం చేసుకున్నప్పటికీ, పక్కకు వెళ్ళిన తరువాత పక్కన ఉన్న ఫ్రెండో, మరే ఇతర వ్యక్తుల ప్రభావం వల్లన ఆలోచనలు పక్కదారి పడుతున్నాయి.. అలాగే ఇంకో విషయం, పోనీ సరైన వయసు రాగానే ఆ వయసుకు తగ్గట్లు వచ్చే మార్పుల గురించి తల్లితండ్రులు స్నేహ భావంతో తెలియజేయాల్సిన అవసరం ఉంది.. కానీ, "చీ, చండాలంగా చిన్న పిల్లలతో అవన్నీ ఎలా చెప్తాం..?" అనే అలోచనలతో వారు మాట్లాడరు.. తద్వారా ఏమవుతుండంటే, ఆ అమ్మాయి/అబ్బాయి ఆ వయసులో వచ్చే కుతూహలంతో సెక్స్ సైట్లకో, బూతు పుస్తకాలకో, ఫ్రెండ్స్ తో బూతు పురాణాలకో దగ్గరవుతాడు.. వాళ్ళలో కొందరు రాక్షసులుగా తయారయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు.. సర్వేల ప్రకారం నూటికి 90% మంది ఆ కోవకు చెందిన వాళ్ళే.. కాబట్టి పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ ఎంత అవసరమో, సమాజం వ్యవహరించే తీరు కూడా అంతే ముఖ్యం.
- సత్యం గడ్డమణుగు.
అంతకు ముందు ఆతరువాత, అష్టాచమ్మ సినిమాల దర్శకుడు శ్రీ ఇంద్రగంటి మోహన కృష్ణ గారితో కలిసి నేను చేసిన మూవీ ప్రమోషను ప్రోగ్రాం ను ఈ కింది వీడియోలో చూడండి.