తండ్రి ప్రేమ పిల్లలకెంతో ముఖ్యం....!



పూర్వం తండ్రి అంటే పిల్లలకు భయంతో కూడిన గౌరవం, తండ్రి గుమ్మంలోకి అడుగుపెట్టారంటే చాలు ఇంట్లో మౌనం తాండవమాడేది. పిల్లల కోరికల చిట్టా అంతా అమ్మ దగ్గరే. నాన్నకీ, పిల్లలకూ మధ్య అమ్మ వారధిగా నిలిచేది. పిల్లల విన్నపాలన్నీ తండ్రికి చేరేసేది. నేడు పరిస్థితులు మారాయి. పిల్లల పెంపకం తల్లి బాధ్యతేననే రోజులుపోయాయి. ఈమార్పు మెచ్చుకోదగ్గది. నేటి ఖర్చురోజుల్లో ఒక్కరితో ఇల్లు గడవడం ఎంత కష్టమో... ఉద్యోగంచేసే ఇల్లాలు అన్నిపనులూ చక్కదిద్దుకోవడం అంతే కష్టం. అలానే పిల్లల బాధ్యత కూడా!అసలు పిల్లలకు ఇద్దరి ప్రేమ అవసరం. అమ్మ అనురాగం ఒక్కొక్కసారి పిల్లల తప్పుల్ని కాస్తుంది. మరేం ఫర్వాలేదని ధైర్యాన్నిస్తుంది. కానీ నాన్న ప్రేమ క్రమశిక్షణతో కూడి ఉంటుంది. అందుకే తండ్రి ప్రేమ పిల్లలకెంతో ముఖ్యం. అది వారి భవిష్యత్తుకు బంగారుబాట వేస్తుంది. నాటి తండ్రిపట్ల ఉన్న భయభక్తులు ఏ మూలకు పారిపోయాయో కానీ, నేటి తండ్రి పిల్లలకు మానసికంగా చాలా దగ్గరయ్యాడు. అభిప్రాయాలనూ పంచుకోవడానికి... మంచీచెడూ నిర్ణయించుకోవడానికీ ఈ దగ్గరితనం ఎంతో సాయపడుతోంది.


నేటి తండ్రి ఓ స్నేహితుడు. ఈ మార్పు ఇరువురికీ లాభదాయకమే! తండ్రి ముందు జాగ్రత్తలు చెపుతాడు. చదువులో సలహాలిస్తాడు. సమాజంలో మార్పులను విశదీకరిస్తాడు. వ్యవహారజ్ఞానం పంచుతాడు. ఆపదకాలంలో వెన్నంటి నిలుస్తాడు. సమస్య వచ్చిందంటే బాసటగా నిలుస్తాడు. పిల్లల వ్యక్తిత్వ నిర్మాణానికి ఈ అనుబంధంతో కూడిన మార్గదర్శకత్వం అవసరం. ముఖ్యంగా కౌమారదశలో పిల్లలకు తండ్రి అండాదండా ఎంతో అవసరం. తమలో రేకెత్తే భావోద్వేగాలను, అనుమానాలను తనలోనే అణచుకోకుండా పంచుకోవడానికి తండ్రిని మించిన తోడు లేదు. తల్లి నవమాసాలే మోస్తుంది. కానీ తండ్రి బిడ్డకో దారిచూపించేవరకూ వారి బరువు బాధ్యతలను మోస్తాడు. అందుకు ఎదురైన కష్టనష్టాలను ఆనందంగా భరిస్తాడు. పెంపకాన్ని, ప్రేమనూ పంచుకోవడంలో... బంధాలను పటిష్టపరచుకోవడంలో... నమ్మకాన్ని, విలువలనూ పెంపొందించుకోవడంలో తండ్రి ప్రేమ గొప్పది. మురిసిపోదగ్గది!!

1 కామెంట్‌:

  1. తల్లి, ప్రేమకు మారు పేరు. తండ్రి, బాధ్యతకు చూపుడు వేలు. నవ మాసాలు బరువును తల్లి మోస్తే, చేతికందొచ్చెవరకు కొడుకు పట్ల బాధ్యత వహిస్తాడు. మొత్తానికి కొడుకు పెంపకంలో సాధకబాధకాలను సహీంచి మంచి పౌరుడుగా తీర్చిదిద్దుతారు. తల్లితండ్రి కొడుకుకు రెండు కళ్ళవంటివారు. కళ్ళు వేరైన దృష్టి ఒకటే.

    రిప్లయితొలగించండి

అంతకు ముందు ఆతరువాత, అష్టాచమ్మ సినిమాల దర్శకుడు శ్రీ ఇంద్రగంటి మోహన కృష్ణ గారితో కలిసి నేను చేసిన మూవీ ప్రమోషను ప్రోగ్రాం ను ఈ కింది వీడియోలో చూడండి.