తాగుబోతు భారతం||సాట్నా సత్యం||

*****************************
సంకలెత్తిన సిన్నదాన్ని సినిమాల జూసి సప్పట్లు గొట్టే ఈ జనాలు..
సక్కంగ బాగుపడే పన్లు జేసుకుందాం రండిరా అంటే, మాట వినరు..

సీను లేని సినిమాకి సింగిల్ డే కూడా పోరు,
సారా తాగి సిందులేసి ఇంటిదాని సీను సితారయ్యే దాకా ఊరుకోరు..

నాయాళ్ళు.. తాగనీకి డబ్బులొస్తాయిగాని,
సంటోడ్ని ఇస్కూలికి పంపమంటే మాత్రం పేదోళ్ళమని నీలుగుతరు..

తాగనీకి అప్పుల్జేస్తరు..
అప్పుల్దీరట్లే అని బాదల తాగుతరు..

తాగనీకి ఇల్లు గుల్ల జేస్తరు..
ఇంటిని సక్కబెట్టలేకపోతుండా అని మల్లా తాగుతరు..

పెళ్ళాం మెడల తాళి ని సారకు తాకట్టు బెడతరు,
నా బుచ్చికి కమ్మలన్నా సేయించకపోతింటే అని బాదపడతరు..
ఆ బాదల మల్లా తాగుతరు..

ఎవడైనా తాగి వాగతంటే తాగుబోతు నాయాల గాడు అని
తిట్టిన నాకొడుకే పొద్దుబోయేసరికి తాగి తూలుతా వస్తడు..

వారానికోపాలి సెల్లుల్లో బూతు బొమ్మలెక్కించుకోనీకి
సెల్లు షాపోనికి 200 రూపాయలిస్తడు కానీ,
నెలల బిడ్డ ఆడుకోనీకి ఓ చిన్న బొమ్మ కొనీనీకి డబ్బుల్లేవ్ అంటడు..

తాగితె గానీ అందంగ గనపడని పెళ్ళాం,
ఆ సార కంపుతోనే సంసారం చేయ్యాల..

పంచుతున్న సార ప్యాకెట్టు నోటిత కొరికి
సుక్క సప్పత్తునే, మద్యం నిషేదం అని సెప్పే సిల్లరనాయాళ్లకి
జేజేలు కొట్టి మరీ వోటులేస్తరు..
ఐదేళ్లకోసారైనా ఫ్రీగ మందు దొరికిద్దని సిన్న ఆశ..

- సాట్నా సత్యం, 16-01-2014, 11:49

4 కామెంట్‌లు:

అంతకు ముందు ఆతరువాత, అష్టాచమ్మ సినిమాల దర్శకుడు శ్రీ ఇంద్రగంటి మోహన కృష్ణ గారితో కలిసి నేను చేసిన మూవీ ప్రమోషను ప్రోగ్రాం ను ఈ కింది వీడియోలో చూడండి.